Akkineni Family | అక్కినేని అఖిల్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ బ్రేక్‌ను లెనిన్ సినిమా అందించింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే భారీ గ్రాస్ వసూళ్లు నమోదు చేయడంతో అఖిల్ కెరీర్లో ఇది అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో అఖిల్ తదుపరి ప్రాజెక్టులపై భారీ ఆసక్తి నెలకొంది. ‘లెనిన్’ విజయంతో అఖిల్ మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విజయాన్ని కొనసాగించేలా ఆయన కూడా తన భవిష్యత్ చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఇకపై సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా వరుసగా ప్రేక్షకుల ముందుకు రావాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.లెనిన్ సినిమా ప్రమోషన్ల సమయంలో అఖిల్ అభిమానులకు ఒక హామీ ఇచ్చారు. ఇకపై తన సినిమాల కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని, వేగంగా కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసి విడుదల చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అఖిల్ ఇప్పటికే రెండు కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అందులో ఒక సినిమా అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఓ భారీ పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ధీర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు, కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా అఖిల్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఇక అఖిల్ కొత్త ప్రాజెక్టులతో పాటు మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మనం చిత్రం తర్వాత మరోసారి కుటుంబ సభ్యులంతా కలిసి నటించే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.