‘కన్నప్ప’ చిత్రంలో బ్రాహ్మణులనుగాని, ఇతర కులాల వారికిగాని కించపరచలేదని చిత్ర రచయితల్లో ఒకరైన ఆకెళ్ల శివప్రసాద్ అన్నారు. మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల పేర్లు తమ వర్గాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు కోర్టుకెక్కాయి.
ఈ వివాదంపై రచయిత ఆకెళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహాత్యం ఆధారంగా తెరకెక్కించాం. ఇందులోని ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకు చూపించాం. వారు ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమాను తీశారు. ఏ వర్గం వారిని కించపరిచే ఉద్దేశ్యం చిత్రబృందానికి లేదు. దయచేసి వదంతులను నమ్మొద్దు’ అని కోరారు. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.