Akhil Akkineni | ఇటీవల అక్కినేని వారింట్లో శుభకార్యం జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని జూన్ 6న జైనబ్ అనే యువతితో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల అంగీకారంతో హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం గ్రాండ్ రిసెప్షన్ వేడుక కూడా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి జరిగిన తర్వాత నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. చైతూ కూడా ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ పంచుకున్నాడు. కాని అఖిల్ ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు. కాని పెళ్లి జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత, అఖిల్ తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. “నా జీవితంలో అత్యుత్తమమైన రోజును మీతో పంచుకుంటున్నాను” అంటూ భావోద్వేగంగా కామెంట్ చేశాడు. ఇంత ఆలస్యంగా ఫోటోలు షేర్ చేయడం వల్ల “ఇప్పుడు పెళ్లయిందన్న విషయం చెబుతున్నారా?” అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే అఖిల్ షేర్ చేసిన ఫొటోలలో నాగ చైతన్య, శోభితల పిక్ ఒక్కటి కూడా లేకపోవడం గమనర్హం ఏది ఏమైన అఖిల్,జైనబ్‌ల పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఆ జంటకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తాయి.
అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామికవేత్త జుల్ఫీ కుమార్తె కాగా, ఆమె వేల కోట్ల ఆస్తులకు వారసురాలు అని అంటున్నారు. అఖిల్ కన్నా జైనబ్ 9 సంవత్సారలు పెద్దది. ఈ ఇద్దరి మధ్య ఏదో సందర్భంలో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని అంటున్నారు. జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జున కుటుంబాలకు కూడా వ్యాపారంలో పరిచయాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే వారి ప్రేమ, పెళ్లికి వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఇక అఖిల్ ప్రస్తుతం “లెనిన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో, మొదట శ్రీలీల హీరోయిన్గా ఎంపికైనప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.