Akhil | అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని కెరీర్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా, కొత్త ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ తన కెరీర్, మూడు సంవత్సరాల విరామం, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాలుగా తన నుంచి సినిమా రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారని అఖిల్ అన్నారు. ఇంత పెద్ద గ్యాప్ వచ్చినందుకు ముందుగా అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కానీ ఇకపై సినిమాల మధ్య ఇంత విరామం ఉండదు.
వరుసగా సినిమాలు చేస్తాను. ఒకవేళ మళ్లీ ఇంత సమయం తీసుకుంటే మా ఇంటికొచ్చి నన్ను కొట్టండి. ఆ బాధ్యతను నేనే తీసుకుంటున్నాను అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘లెనిన్’ విడుదలైన వెంటనే ఇప్పటికే విన్న పలు కథల్లో మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు. గత చిత్రం ఏజెంట్ తర్వాత ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నకు కూడా అఖిల్ సమాధానం ఇచ్చారు.సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత ప్రమాదవశాత్తూ బాత్రూమ్లో జారి గాజు ముక్కలపై పడటంతో ఎడమ చేతికి తీవ్ర గాయమైందని తెలిపారు. ఆ ప్రమాదం కారణంగా రెండు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని, మొత్తం 48 కుట్లు పడ్డాయని చెప్పారు.
ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలలు పట్టిందని, అనంతరం సరైన కథ కోసం కూడా కొంత సమయం కేటాయించాల్సి వచ్చిందని వివరించారు.ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ‘లెనిన్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కూడా అఖిల్ భావోద్వేగంగా మాట్లాడారు. ఈసారి నేను ఎక్కువగా మాట్లాడను. నా సినిమానే మాట్లాడుతుంది. గత కొద్ది రోజులుగా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నా, అభిమానుల ప్రేమ, ఉత్సాహం నాకు కొత్త శక్తిని ఇచ్చాయి. ఈసారి నన్ను నమ్మండి అని ఆయన అన్నారు. దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ‘లెనిన్’లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంతో అఖిల్ తన కెరీర్లో బలమైన విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.