Akhanda 2 | సింహా, లెజెండ్, అఖండల తర్వాత బోయపాటి శ్రీను–నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో మరోసారి రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ డ్రామా అఖండ 2పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అఖండకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసిన టీం, నవంబర్ 21న అఖండ 2 తాండవం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు ప్రాధాన్యత తెచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం, సీ. రాంప్రసాద్–సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటకలోని చింతామణిలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన గ్రాండ్ ఈవెంట్లో విడుదలైన ఈ ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్ల నిడివితో పూర్తిగా బాలయ్య మాస్, ధర్మం, రౌద్రం చుట్టూ నడిచే హై వోల్టేజ్ ప్రెజెంటేషన్‌గా కనిపించింది.
“కష్టమొస్తే దేవుడొస్తాడు అని నమ్మే జనానికి, కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్లు నమ్మినరోజు భారతదేశం తునాతునకలైపోతుంది” అంటూ ట్రైలర్ ప్రారంభమై ఓ గంభీరత, మాయాజాలం నింపిన మూడ్‌ను సెట్ చేసింది. వెంటనే కుంభమేళా నేపథ్యంతో విలన్ ఆది పినిశెట్టి ప్రవేశం, “8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి” అంటూ చెప్పిన డైలాగ్ కథలోని దుష్టశక్తుల తీవ్రతను తెలిపింది. తరువాత మురళీ కృష్ణ పాత్రలో సాఫ్ట్ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు చూపించగా, మంచు కొండల్లో యువతిని వెంబడించే సన్నివేశం తర్వాత అఖండ ఎంట్రీ హై వోల్టేజ్‌గా కట్ చేయబడింది. “ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా కనిపించేది మతం… ఈ దేశంలో కనిపించేది ధర్మం… సనాతన హైందవ ధర్మం” అంటూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బోయపాటి–బాలయ్య స్టైల్ ఏంటో తెలియజేసింది. త్రిశూలంతో సర్జికల్ స్ట్రైక్ స్టైల్లో చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్, “మేం ఒకసారి లేచి శబ్ధం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్ధం” అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అఖండ 2లోని రౌద్ర రూపాన్ని స్పష్టంగా చూపించింది.
బాలకృష్ణ మురళీ కృష్ణగా, అఖండగా డ్యూయల్ షేడ్స్‌లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆది పినిశెట్టి మాంత్రికుడిగా భయపెట్టే లుక్, సంయుక్త మీనన్ గ్లామర్, హర్షాలీ మల్హోత్రా ఇంపాక్ట్ ట్రైలర్లో ప్రత్యేకతను తెచ్చాయి. థమన్ ట్రేడ్‌మార్క్ బీజీఎం, బీట్లు ట్రైలర్ మొత్తాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశాయి. మొత్తం మీద అఖండ 2 తాండవం ట్రైలర్ అంచనాలను పెంచడమే కాకుండా, స్క్రీన్‌పై బాలయ్య నుంచి మరొక భారీ మాస్ ఎక్స్ప్లోషన్ రాబోతుందనే సంకేతాలు ఇచ్చింది. డిసెంబర్ 5 నాటికి ఈ ధర్మ యుద్ధం తెరపై ఎలా కనిపించబోతుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.