ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ ముందు వరుసలో ఉంటుంది. బోయపాటి శ్రీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవలే జార్జియాలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ని షూట్ చేశారు. నేటి నుంచి హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతోపాటు యూనిట్ అంతా పాల్గొంటారు.
సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తామని మేకర్స్ తెలిపారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్బుతమైన స్పందన వచ్చిందని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయని, తొలి పార్ట్ ‘అఖండ’ను మించేలా ఈ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకునిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: ఎస్.థమన్, సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్.