‘బాలకృష్ణ, బోయపాటిది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. పైగా హ్యాట్రిక్ తర్వాత వారిద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది. దాంతో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చాలా బిగ్ స్పాన్ ఉన్న కథ ఇది. బాలకృష్ణతో 2014లో ‘లెజెండ్’ చేశాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయనలోని ఎనర్జీ ఇంకా పెరిగింది. ఆయనతో కూర్చుంటే ఆ ఎనర్జీ మనకి కూడా వస్తుంది.’ అన్నారు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వారు నిర్మించిన చిత్రం ‘అఖండ : తాండవం’. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్‌ని మహాకుంభమేళాలో షూట్ చేశాం. ఈ సినిమాలో కుంభమేళాకు సంబంధించిన మీరు చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే. అన్ని పర్మిషన్స్నీ తీసుకొనే షూట్ చేశాం. బోయపాటి అహర్నిశలు కష్టడి ఈ సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇందులో ప్రతి యాక్షన్ సన్నివేశం శివతాండవాన్ని తలపిస్తుంది. త్రిశూలాన్ని ఇందులో వాడినట్టు ఏ సినిమాలో వాడలేదు. జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో షూట్ చేశాం. మేమంతా స్వెటర్లు వేసుకున్నాం కానీ, బాలయ్య మాత్రం ఆ చలిలోనే అఘోరా గెటప్‌లో అద్భుతంగా నటించారు. ఇందులో అన్ని పాత్రలూ ఆకట్టుకుంటాయి. సనాతనధర్మం, నమ్మకం, భక్తి.. ఈ మూడు అంశాలపై నడిచే కథ ఇది. స్త్రీలు, పిల్లలు, దేవాలయాల జోలికొస్తే శివుడొస్తాడని ‘అఖండ’లో రిజిస్టర్ చేశారు. దానికి కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుంది.’ అని తెలిపారు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట. ఇప్పటివరకూ విడుదలై ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని, యూనివర్సల్ స్కోప్ ఉన్న ఈ సినిమాను త్రీడీలో చూస్తే మరింత మజా ఉంటుందని, హిందీతోపాటు సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నామని, లోకల్‌గా తీసినా గ్లోబల్‌గా రీచ్ అయ్యే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు.