ఓ వైపు వరుస విజయాలు.. మరోవైపు జాతీయ పురస్కారాలు.. బాలకృష్ణకు ప్రస్తుతం మహర్దశ నడుస్తున్నది. ఆయన రానున్న సినిమా ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, విడుదలైన తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. బాలకృష్ణ కెరీర్లో తొలి పానిండియా సినిమాగా ‘అఖండ 2: తాండవం’ రానుంది. రేపు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ‘అఖండ 2: తాండవం’ టీజర్ నేడు విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. నంది, ఢమరుకంతో కూడిన త్రిశూలాన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన 111వ చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. బాలయ్యతో బ్లాక్బస్టర్ ‘వీరసింహారెడ్డి’ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఉగ్రసింహాన్ని, ఓ లోహ కవచాన్నీ పోస్టర్లో చూపిస్తూ మాస్ మెచ్చేలా పోస్టర్ని డిజైన్ చేశారు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఓ ఎపిక్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా.