‘నా శివుడి అనుమతిలేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు..నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?’ అంటూ ప్రళయకాల రుద్రుడివలే ‘అఖండ-2: తాండవం’కు సిద్ధమయ్యారు అగ్ర నటుడు బాలకృష్ణ. ఆయన తాజా చిత్రం ‘అఖండ-2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నేడు బాలకృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. కైలాస పర్వతం నేపథ్యంలో మొదలైన టీజర్ ఆద్యంతం రోమాంచితంగా సాగింది.
అఖండగా బాలకృష్ణ పాత్ర రౌద్రరసపూరితంగా సాగింది. ‘వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది..’ అనే సంభాషణతో ముగిసిన టీజర్ అభిమానులకు కావాల్సినంత థ్రిల్‌ను పంచింది. దర్శకుడు బోయపాటి శ్రీను యూనిక్ మేకింగ్, బాలకృష్ణ హై ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్, కైలాసగిరి నేపథ్య విజువల్స్ టీజర్‌పై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: తేజస్విని నందమూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.