Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ మాస్ట్రో బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 గురువారం రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే మూవీ టీం వరుసగా సర్ప్రైజెస్ ఇస్తూ హైప్‌ను ఆకాశానికెత్తుతోంది. బుధవారం విడుదలైన స్పెషల్ టీజర్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించగా, తాజాగా విడుదల చేసిన ‘శివ శివా’ ఎమోషనల్ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. “ప్రాణం పోసిన శంకరుడాడే చోట… కట్టిన పుణ్యం కట్టెలపాలుకు సిద్ధం చేసే ఆటేరా…” అంటూ కనకవ్వ, శ్రుతి రంజనీ పాడిన ఈ పాట శివతత్వాన్ని, తల్లి–కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా మేళవించేలా సాగుతుంది. కల్యాణ్ చక్రవర్తి రాసిన హార్ట్ టచ్ చేసే లిరిక్స్, తమన్ ఇచ్చిన సంగీతం కలిసి వినేవారిని మైమరపింపజేస్తున్నాయి.
పాట మొత్తం శివయ్య శక్తి, భక్తి, ఆత్మీయతల్ని ప్రతిబింబించేలా ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ఫిదా అవుతున్నారు. అఖండ ఫ్రాంచైజ్‌కు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మాస్ వైబ్‌ను ఈ సాంగ్ మరింతగా పెంచేసింది. పాటలోని పల్లవి “ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు…” వినగానే అఖండలో బాలయ్య చేసిన గర్జన గుర్తుకు వస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో భారీగా అంచనాలు పెరిగిన అఖండ 2, ఈ సాంగ్‌తో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. సినిమా ప్రీమియర్లు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి అని సంతోషపడే లోపు హైకోర్ట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది.
ఈరోజు ప్రదర్శించే ప్రీమియర్ షోలకు ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ… సినిమా నిర్మాణ సంస్థ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రీమియర్ షోస్‌కి ప్రభుత్వం ఇచ్చిన పర్మీషన్ జీవోని కూడా రద్దు చేసింది. దీంతో తెలంగాణలో నేడు ప్రీమియర్ షోస్ లేనట్టే. అఖండ2 మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావలసి ఉంది. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకి డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడయ్యారు.