బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ-2’ డిసెంబర్ 5న పాన్ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది. శుక్రవారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో ఈ చిత్రం నుంచి ‘తాండవం’ పాటను విడుదల చేశారు. బాలకృష్ణ అఘోర అవతారంలో చేసిన శివతాండవం, తమన్ బాణీ ఈ పాటకు డివైన్ ఫీల్‌ని తీసుకొచ్చాయి. ‘రంగరంగ శంభులింగ ఈశ్వర అంతరంగా హే భుజంగా శంకర’ అంటూ శివుడి మహత్తును ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. శంకర్‌మహదేవన్, కైలాష్‌ఖేర్ ఆలపించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మ యొక్క శక్తి పరాక్రమాలను ఈ సినిమాలో చూస్తారని, ధర్మంగా బతకండి, సత్యం మాట్లాడండి, అన్యాయానికి తలవంచకండి..ఇదే అఖండ తాండవం అన్నారు. మనదేశం తాలూకు వేద సంస్కృతిని, భారతదేశం ఆత్మను ఈ సినిమాలో చూస్తారని, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మైనస్ 12డిగ్రీస్‌లో షూట్ చేశామని, తమకు శివుడే దారి చూపించాడని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్‌తో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.