Akhanda 2 | బాలకృష్ణ అభిమానులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’. డిసెంబర్ 5కు విడుదల కావాల్సిన ఈ చిత్రం, అనూహ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన శుభ వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అఖండ 2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు పరిష్కారమయ్యాయి” అని ఆయన తెలిపారు.
తన అంచనా ప్రకారం డిసెంబర్ 12న ‘అఖండ 2’ విడుదలయ్యే అవకాశముందని వెల్లడించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. ఇక ఇదే సమయంలో సంవత్సరంలో మరో భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కూడా ఇలాంటి సమస్యల వల్లే ఆలస్యమై, చివరకు రిలీజ్ అయ్యిందని తమ్మారెడ్డి గుర్తుచేశారు. రిలీజ్ డిలే సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు తమ్మారెడ్డి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమా ఆలస్యమైందని రిజల్ట్ మారదు. ఓపెనింగ్స్ కూడా ఆశించిన విధంగానే వస్తాయి.
కానీ ముందుగా ప్రకటించిన తేదీకే విడుదలైతే ప్రేక్షకులు రెడీగా ఉండడం వల్ల మొదటి రోజు రెవెన్యూలో 3–4 కోట్ల తేడా ఉండొచ్చు.పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజుల్లోనే రెవెన్యూ ఎక్కువగా వస్తుంది” అని అన్నారు. అంటే, డిలే ఉన్నా బాలయ్య బాక్సాఫీస్ పవర్ పెద్దగా ఉండదనేది ఆయన అంచనా. అఖండ 2 డిసెంబర్ 12 విడుదలపై వస్తున్న వార్తలు బలపడుతుండడంతో ఆస్ట్రేలియా, అలాగే కొంతవరకు ఓవర్సీస్ ప్రాంతాల్లో, ఈ చిత్రానికి సంబంధించి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇది చూస్తుంటే, మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేయబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కావాల్సిన సినిమా నిర్మాతల పాత ఆర్థిక కమిట్మెంట్లు,ఫైనాన్షియర్ల క్లియరెన్స్ సమస్యలు మొదలైన కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.