Akhanda 2 | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించబడుతున్నాయి. రేపు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య తొలిసారి పాన్–ఇండియా రేంజ్లో తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. మొదటి భాగం ‘అఖండ’ తెలుగులో మాత్రమే విడుదలైనా, హిందీలో యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి రాగానే కోట్లాది వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ‘అఖండ 2’ ను హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.
బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పడం, అలాగే హర్షాలి మల్హోత్రా సహా పలువురు బాలీవుడ్ నటులు సినిమాలో భాగమవడం నార్త్ ఆడియన్స్‌ను ఆకర్షించే స్ట్రాటజీగా మారింది. హిందీ మార్కెట్లో ఈసారి ప్రమోషన్స్ గట్టిగానే జరిగాయి. ముంబైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించిన మేకర్స్, ప్రధాన నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, బాలయ్య ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉత్తరాదిలో సినిమాపై కుతూహలం పెంచాయి. హిందీ టీజర్, ట్రైలర్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలి కాలంలో ‘మహావతార్ నరసింహ’, ‘కాంతార 2’ వంటి ఆధ్యాత్మిక–మైథిలాజికల్ సినిమాలు హిందీలో భారీ విజయాలు సాధించాయి. అదే పంథాలో ‘అఖండ 2’ కూడా సనాతన ధర్మ పరిరక్షణ, శివ తత్వం, అఘోరాల శక్తి వంటి విషయాలను తెరపై చూపనుంది. ఈ అంశాలు నార్త్ బెల్ట్ ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అవుతాయన్న నమ్మకం మేకర్స్‌లో ఉంది.
ఇప్పటి వరకూ టాలీవుడ్ సీనియర్ హీరోలు పాన్–ఇండియా మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. చిరంజీవి ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ హిందీలో మార్క్ చూపలేకపోయాయి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ హిందీలో ఫలితం ఇవ్వలేదు. వెంకటేష్ ‘సైంధవ్’ పాన్–ఇండియాలో డిజాస్టర్.ఇప్పుడు బాలయ్యకు ఇది పెద్ద పరీక్ష. ‘అఖండ 2’ సక్సెస్ అయితే, పాన్–ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన తొలి సీనియర్ హీరోగా బాలయ్య రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. అఖండ 2 పై భారీ అంచనాలు, పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో‘బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో అన్నది చూడాలి.