Akhanda 2 | నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగమైన ‘అఖండ’ సృష్టించిన సంచలనానికి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సీక్వెల్‌పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే థియేటర్లలో విడుదలైన సమయంలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాలయ్య అభిమానులకు కావాల్సిన మాస్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్ మాత్రం ఫుల్ ట్రీట్ ఇచ్చాయని చెప్పాలి.ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రావడంతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
సంక్రాంతి సెలవుల సందర్భంగా జనవరి 9 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో పాన్ ఇండియా లెవల్లో వీక్షకులు చూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అఘోరా గెటప్, పవర్ఫుల్ డైలాగులు, బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మాస్ ఫీల్‌ను మరింత పెంచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీన్లు అతిగా అనిపించినా, పండుగ సీజన్లో ఇంటివద్ద కూర్చొని చూసే మాస్ ఎంటర్టైనర్గా ఇది సరిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కథ విషయానికి వస్తే, తొలి భాగం ముగిసిన దగ్గర నుంచే కథ కొనసాగుతుంది. టిబెట్ సరిహద్దులు, కుంభమేళా నేపథ్యంగా సాగే ఈ కథలో దేశ భద్రత, సనాతన ధర్మ పరిరక్షణ అంశాలు ప్రధానంగా నడుస్తాయి. భారతదేశంపై బయోలాజికల్ వార్ చేయాలనే శత్రుదేశాల కుట్రను అడ్డుకోవడానికి రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. ఇస్రో శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ అంశం చుట్టూ తిరిగే ఈ కథలో యాక్షన్‌తో పాటు దేశభక్తి టోన్ బలంగా ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత బాలయ్య–బోయపాటి కాంబో నుంచి వచ్చిన నాలుగో చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి, థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీలో ‘అఖండ 2: తాండవం’కి మళ్లీ మంచి అటెన్షన్ లభిస్తోంది. బాలయ్య మాస్ ఫ్యాన్స్‌కు ఇది మరోసారి పండుగ కానుకగా మారిందని చెప్పొచ్చు.