తారాగణం : బాలకృష్ణ, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, పూర్ణ, సస్వతా చటర్జీ..
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఆకాశమంత అంచనాలతో ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘అఖండ 2’ విడుదలైంది. బాలకృష్ణ కెరీర్లో తొలి సీక్వెల్ ఇది. అంతేకాదు.. ఆయన కెరీర్లో తొలి పానిండియా సినిమా కూడా ఇదే. పైగా బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్ కావడం.. అందునా అపజయం ఎరుగని బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై నిర్మాణంలో ఉన్నప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా.. అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. మరి అందరి అంచనాలనూ ‘అఖండ 2’ నిజం చేసిందా? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తాండవం షురూ చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలిపే ముందు కథేంటో చూద్దాం.
కథ
భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలంటే ధర్మాన్ని చంపేయాలని, దేవుడిపై దేశప్రజలకున్న నమ్మకాన్ని చంపేయాలనే క్రూరమైన ఆలోచన చేస్తుంది శత్రుదేశం చైనా. అందుకోసం ఓ భయంకరమైన వైరస్‌ని సృష్టిస్తుంది. స్వార్థపరత్వం, పదవీకాంక్షతో మలినమైపోయిన ఓ ఇండియన్ పొలిటీషియన్ సహాయంతో ఆ వైరస్‌ని కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరించే మహాకుంభమేళా సాక్షిగా గంగానదిలో కలుపుతుంది. దాంతో ఆ వైరస్ దేశమంతా పాకుతుంది. మనుషులు పిట్టల్లా రాలిపోతుంటారు. ఇదే అదనుగా ఆ పొలిటీషియన్తో దేవుడు లేడంటూ, నిజంగా దైవం ఉంటే ఇలాంటి ఉపద్రవం జరిగేదా? అంటూ ప్రచారం కూడా చేయిస్తుంది చైనా. ఇలా చేయడం వల్ల జనాలకు దైవంపై నమ్మకం సన్నగిల్లుతుంది. తద్వారా ధర్మాన్ని విడిచిపెడతారు. అప్పుడే తేలిగ్గా దేశాన్ని నిర్వీర్యం చేయొచ్చనేది వారి ఆలోచన. మరోవైపు ఆ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ని కనుక్కొటుంది సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా). ఆ వ్యాక్సిన్‌ని దేశానికి చేరకుండా విధ్వాసాన్నే సృష్టిస్తుంది చైనా. జనని ప్రమాదం పడుతుంది. వ్యాక్సిన్ శత్రువుల చేతికి చిక్కుతుంది. హిమాలయాల్లో ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనని ఆర్తనాదం తపోనిష్టలో ఉన్న అఖండ (బాలకృష్ణ) చెవిన పడుతుంది. అలా అఖండ ఆగమానం జరుగుతుంది. ఆ తర్వాత దుష్టసంహారం ఎలా జరిగింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ధర్మం ప్రమాదం పడినప్పుడు ధర్మరక్షకుడు వస్తాడు. ధర్మసంస్థాపన చేస్తాడు.. అదేది ‘అఖండ’ సినిమా కథ. ఈ సీక్వెల్ కథ కూడా అదే. కాకపోతే ‘అఖండ’లో కాస్త కథ కనిపిస్తుంది. ఇందులో పెద్దగా కథేం ఉండదు. దర్శకుడు బోయపాటి కొన్ని సన్నివేశాలు మాస్ మెచ్చేలా పకడ్బందీగా రాసుకొని ఈ సినిమా చేసేశారేమో అనిపిస్తుంది. ఈ సినిమాకు వచ్చిన హైప్‌కు సరైన కథతో సినిమా తీసి ఉంటే బాక్సాఫీస్ వసూళ్లతో ఇండియా షేక్ అయ్యేది. కానీ కేవలం బాలకృష్ణపైనే దృష్టి పెట్టారు తప్ప.. కథపై పెద్దగా దృష్టి పెట్టలేదు దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే.. ‘అఖండ’గా బాలకృష్ణ రూపం బాలయ్య కెరీర్లోనే బెస్ట్ అనాలి. తనని చూస్తుంటే సాక్షాత్ శివుడ్నే చూస్తున్నట్టనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఆయన నటన శివుడి ఉగ్రతాండవాన్నే తలపించిందని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్స్, ఆ స్టంట్ కొరియోగ్రఫీ, ఆ నేపథ్య సంగీతం.. బాలయ్య అభినయం నిజంగా నభూతో న భవిష్యత్ అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో రెండో బాలకృష్ణ ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో బాలయ్య చెప్పే డైలాగులు, అఖండ ఆగమనంతో కూడిన ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ప్రథమార్ధం చెప్పుకోడానికి ఏమీ లేదు. ఇక ద్వితీయార్ధం అంతా సనాతన ధర్మం, దాని గొప్పతనం చెబుతూ సాగింది. మధ్య మధ్య కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్. క్షుద్రభూతాలతో అఖండ పోరాటాలు. చివరకు దేశానికీ, ధర్మానికీ ఆపదవాటిల్లేలా చేసిన వారిని చంపడంతో సినిమా అయిపోతుంది. ఈ సినిమా అంతా లాజిక్ లేని ప్రయాణం. లాజిక్ కోసం వెతకడం కూడా నిజంగా తప్పే. ఎందుకంటే.. అఖండ దైవాంశసంభూతుడు. సాక్షాత్ శివగణం. ఆయన ఏం చేసినా అది సాధ్యమే. బోయపాటి ఆ పాత్రను మలిచిన తీరు అలాగే ఉంది. ఇక సినిమాలో ల్యాగ్ అనిపించిన అంశాలు చాలా ఉన్నాయి. ఓ 20 నిమిషాల సీన్స్‌ని ఎడిట్ చేసేయొచ్చు. నిజానికి బాలకృష్ణ కాకుండా.. ఏ హీరో చేసినా ఈ సినిమా విజయం ప్రశ్నార్థకమే అయ్యుండేది. బాలయ్య తన అమోఘమైన నటనాపటిమతో.. ఉద్వేగపూరితమైన హావభావాలతో, అద్భుతమైన సంభాషణా చాతుర్యంతో సినిమాను నిలబెట్టేశారు. ఓ విధంగా ‘అఖండ 2’ వన్ మ్యాన్ షో.
నటీనటులు
ఇది బాలకృష్ణ విశ్వరూపం. అఖండగా, బాలమురళిగా రెండూ పాత్రలకూ అస్సలు పొంతన ఉండదు. అసలు ఇద్దరు నటించారా? అనిపించేంత వ్యాత్యాసం చూపించారు బాలయ్య. ఓ విధంగా ‘అఖండ’ కంటే ‘అఖండ 2’లోనే ఆయన అద్భుతంగా నటించారని చెప్పాలి. బాలకృష్ణ ‘అఖండ’ పాత్ర తర్వాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన పాత్ర హర్షాలీ మల్హోత్రా’ పోషించిన జనని పాత్ర. ‘భజరంగీ భాయిజాన్’ తర్వాత ఆ అమ్మాయి చేసిన సినిమా ఇదేనట. కానీ ఎక్కడా కొత్తగా నటిస్తున్నట్టు లేదు. చక్కగా అనుభవం ఉన్న నటిలా అభినయించింది. ఆది పినిశెట్టి పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో అద్భుతంగా నటించాడు. దుష్టమాంత్రికుడిగా ఆయన కెరీర్లో ఇప్పటివరకూ చేయని పాత్ర చేశాడు. సంయుక్త మీనన్ ఉన్నంతలో సినిమాకు గ్లామర్‌ని అద్దింది. ఫైట్స్ కూడా చేసింది. ఎమోషన్స్‌తో కూడిన పాత్ర అమెది. ఇక మిగతా వారంతా పరిధిమేర పాత్రను రక్తికట్టారు.
సాంకేతికంగా
బోయపాటి శ్రీను ఈ సినిమా కథ విషయంలో జాగ్రత్త పడితే బావుండేది. కథ బలంగా ఉంటే.. అందులో భాగం వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలకు లోనుచేస్తాయి. ఇందులో కథ కాకుండా సన్నివేశాలే హైలైట్ కావడంతో ఆడియన్స్‌ని అవి అంత ఉద్వేగానికి లోను చేయవు. అభిమానులు పండుగ చేసుకునేలా బాలకృష్ణను తెరపై ఆవిష్కరించడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. సినిమా ఆద్యంతం ఆయన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్.. ఆయన మార్క్ టేకింగ్ అన్నీ తెరపై ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాను బాలకృష్ణ తర్వాత నెక్ట్స్ లెవల్లో కూర్చోబెట్టింది తమన్. ఆయన బీజీఎం సినిమాకు ప్రాణవాయువని చెప్పాలి. తెరపై తన మ్యూజిక్‌తో తాండవం ఆడేశాడు తమన్. కెమెరా వర్క్ బావుంది. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి. ఎడిటర్‌కు చాలా పని మిగిలిపోయింది. ఓ అరగంట సినిమాను నరికేయొచ్చు. మొత్తంగా మాస్ సినిమాలను ఇష్టపడేవారికి. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మరి సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను ఏ మాత్రం ఇష్టపడతాడో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
బలాలు
బాలకృష్ణ అభినయం, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ సంగీతం, కొన్ని సన్నివేశాలు..
బలహీనతలు
బలహీనమైన కథ, కొంత ల్యాగ్
రేటింగ్ : 2.75/5