Akhanda 2 | నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆతృతకు తెరపడింది! భారీ అంచనాల మధ్య, ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలకృష్ణ కెరీర్లోనే తొలి సీక్వెల్, తొలి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట మొదలుపెట్టిందా? బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అపజయం ఎరుగని బాలయ్య – బోయపాటి కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అయిందా? తెలుసుకునే ముందు కథాంశాన్ని పరిశీలిద్దాం.
తారాగణం: బాలకృష్ణ, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, పూర్ణ, సస్వతా చటర్జీ.. దర్శకత్వం: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్.ఎస్.తమన్ నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.
కథ:
భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనే క్రూరమైన ఆలోచనతో శత్రుదేశం చైనా ఓ భయంకరమైన వైరస్‌ను సృష్టిస్తుంది. భారతీయుల దైవంపై నమ్మకాన్ని, ధర్మాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. స్వార్థపరుడైన ఓ భారత రాజకీయ నాయకుడి సాయంతో, కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరించే మహాకుంభమేళా సందర్భంగా ఆ వైరస్‌ను గంగానదిలో కలుపుతుంది. దీంతో వైరస్ దేశమంతా పాకి, మనుషులు పిట్టల్లా రాలిపోతుంటారు. ఇదే అదనుగా.. ఆ రాజకీయ నాయకుడితో దైవం లేదంటూ, నిజంగా దైవం ఉంటే ఇలాంటి ఉపద్రవం జరిగేదా? అంటూ చైనా ప్రచారం చేయిస్తుంది. దీనివల్ల ప్రజలకు ధర్మంపై, దైవంపై నమ్మకం సన్నగిల్లి, దేశాన్ని సులభంగా నిర్వీర్యం చేయవచ్చనేది వారి పన్నాగం. మరోవైపు, సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా) ఆ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ని కనుక్కుంటుంది. ఆ వ్యాక్సిన్ దేశానికి చేరకుండా చైనా విధ్వంసం సృష్టిస్తుంది. జనని ప్రాణాపాయంలో పడుతుంది. వ్యాక్సిన్ శత్రువుల చేతికి చిక్కుతుంది. హిమాలయాల్లో ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనని ఆర్తనాదం తపోనిష్టలో ఉన్న అఖండ (బాలకృష్ణ) చెవిన పడుతుంది. అలా శివగణం అయిన అఖండ రంగ ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత దుష్టశక్తుల సంహారం ఎలా జరిగింది? ధర్మాన్ని అఖండ ఎలా నిలబెట్టాడు? అనేది మిగతా కథాంశం.
విశ్లేషణ
ధర్మం ప్రమాదంలో పడినప్పుడు ధర్మరక్షకుడి ఆగమనం… ఇది ‘అఖండ’ మూలకథ. ఈ సీక్వెల్ కూడా అదే పాయింట్‌తో నడిచింది. అయితే, ‘అఖండ’లో కొంత కథ కనిపించినప్పటికీ, ‘అఖండ 2’లో కథనం కంటే బాలకృష్ణ మాస్ ఎలివేషన్స్ పైనే దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంతటి భారీ అంచనాలకు తగ్గట్టుగా బలమైన కథను రాసుకుని ఉంటే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేదని చెప్పడంలో సందేహం లేదు. అయినా సరే… తెరపై ‘అఖండ’గా బాలకృష్ణ రూపం, అభినయం మాస్ ప్రేక్షకులకు పండుగే. బాలయ్య కెరీర్లోనే ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఆయన నటన, శివుడి ఉగ్రతాండవాన్ని తలపించేలా సాగింది. ఆ ఎలివేషన్స్, అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీ, థమన్ నేపథ్య సంగీతం తోడై… అభిమానులకు పూనకాలు తెప్పించాయి.
ప్రథమార్థంలో రెండో బాలకృష్ణ పాత్ర (బాలమురళి) ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్, పవర్ఫుల్ డైలాగులు, ఆ వెంటనే అఖండ ఆగమనంతో కూడిన ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా నిలిచాయి. ద్వితీయార్థం అంతా సనాతన ధర్మం, దాని గొప్పతనం చెబుతూ సాగింది. మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, క్షుద్రశక్తులతో అఖండ పోరాటాలు… చివరికి దేశానికి అపద కలిగించిన వారిని అంతం చేయడంతో కథ ముగుస్తుంది.
లాజిక్ కోసం వెతకడం ఈ సినిమా విషయంలో అనవసరం. ఎందుకంటే అఖండ దైవాంశసంభూతుడు. శివగణమైన అఖండ ఏం చేసినా అది సాధ్యమే అన్నట్టుగానే బోయపాటి ఆ పాత్రను మలిచారు. అయితే, కథనంలో దాదాపు 20 నిమిషాల నిడివిని ఎడిట్ చేయవచ్చనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, బాలకృష్ణ కాకుండా ఏ ఇతర హీరో చేసినా ఈ చిత్రం విజయం ప్రశ్నార్థకమే అయ్యేది. బాలయ్య తన అద్భుతమైన నటనాపటిమతో, ఉద్వేగభరితమైన హావభావాలతో, సంభాషణలతో సినిమాను నిలబెట్టారు. ‘అఖండ 2’ పూర్తిగా బాలకృష్ణ వన్ మ్యాన్ షో!
నటీనటులు
అఖండగా, బాలమురళిగా బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలకు పూర్తి వ్యత్యాసం చూపించి విశ్వరూపం ప్రదర్శించారు. ‘అఖండ’ కంటే ‘అఖండ 2’లోనే ఆయన అద్భుతంగా నటించారని చెప్పాలి.
‘భజరంగీ భాయిజాన్’ తర్వాత హర్షాలీ మల్హోత్రా చేసిన సినిమా ఇదే అయినప్పటికీ, అనుభవజ్ఞురాలైన నటిలా చక్కగా నటించింది.ఆది పినిశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా, దుష్టమాంత్రికుడిగా తన కెరీర్లోనే కొత్త పాత్రను అద్భుతంగా పోషించాడు. సంయుక్త మీనన్ గ్లామర్‌తో పాటు ఎమోషన్స్‌తో కూడిన పాత్రలో ఫైట్స్ కూడా చేసి ఆకట్టుకుంది.
సాంకేతికంగా
దర్శకుడు బోయపాటి శ్రీను కథ విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. కేవలం సన్నివేశాలు హైలైట్ కావడం వల్ల ఆడియన్స్ అంత ఉద్వేగానికి లోను కారు. అయినప్పటికీ, అభిమానులు పండుగ చేసుకునేలా బాలకృష్ణను తెరపై ఆవిష్కరించడంలో ఆయన సఫలమయ్యారు. ఆయన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, టేకింగ్ అన్నీ ఆకట్టుకుంటాయి.ఈ సినిమాకు బాలకృష్ణ తర్వాత నెక్ట్స్ లెవల్లో కూర్చోబెట్టింది ఎస్.ఎస్.తమన్. ఆయన అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రాణవాయువు. తన మ్యూజిక్‌తో థమన్ తెరపై తాండవం ఆడేశాడు. కెమెరా వర్క్ మెరుగ్గా ఉంది. అయితే, గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయి.
చివరిగా.. మొత్తంగా, మాస్ సినిమాలను ఇష్టపడేవారికి, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు ‘అఖండ 2’ పండుగలా అనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట షురూ చేసిన ఈ చిత్రం.. సగటు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.