Akhanda 2 | బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మాస్–యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ థియేటర్లలో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా, తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాస్, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలు మేళవించిన కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాలయ్య నట విశ్వరూపం, శివతాండవాన్ని తలపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. థియేటర్ల వద్ద భారీ రష్, హౌస్‌ఫుల్ బోర్డులు, ఫ్యాన్స్ సంబరాలు కలిసి ‘అఖండ 2’ ఆగమనాన్ని గ్రాండ్‌గా మార్చేశాయి. ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి అదనపు బలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ ప్రభావం నేరుగా కలెక్షన్లపై కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ షోలు ఫుల్ అవుతున్నాయని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రేడ్ అంచనాల ప్రకారం, ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో గంటకు సుమారు 10 నుంచి 15 వేల టికెట్లు బుక్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు రూ.65 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, సాక్నిల్క్ వెబ్సైట్ ప్రచారం ప్రకారం ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.30.75 కోట్లు, కర్ణాటకలో రూ.3.77 కోట్లు, తమిళనాడులో రూ.1.13 కోట్లు, కేరళలో రూ.3 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 లక్షలు మాత్రమే వసూలైనట్లు పేర్కొంది. మొత్తంగా చూస్తే ‘అఖండ 2’ తొలి రోజు ఇండియాలో రూ.36.18 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2021లో కరోనా పరిస్థితుల మధ్య విడుదలైన ‘అఖండ’ కూడా అప్పట్లో తొలి రోజు సుమారు రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2’ ఆ మార్క్‌ను చాలా రెట్లు దాటే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరిస్తుండటంతో వీకెండ్ నాటికి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదే జోరు కొనసాగితే, మొదటి వారంలోనే ‘అఖండ 2’ దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకునే ఛాన్స్ ఉందని అంచనా. బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఉన్న నమ్మకం, సోషల్ మీడియాలో సాగుతున్న పాజిటివ్ ప్రచారం, లాజిక్స్ కంటే ఎలివేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చిన బోయపాటి టేకింగ్ అన్నీ కలిసి ఈ సినిమాను మరో భారీ బ్లాక్‌బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.
మొత్తానికి, వారం రోజుల ఆలస్యంగా విడుదలైనప్పటికీ ‘అఖండ 2’ థియేటర్లలో మాస్ తుఫాన్‌ను సృష్టిస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలుస్తుందా? ఫస్ట్ వీక్ ముగిసేలోపు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య అభిమానులు మాత్రం ఇప్పటికే ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా ఫిక్స్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు.