Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖండ 2’ .ఈ మూవీ విడుదలపై నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి. అసలు ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా రీలీజ్ కావాల్సి ఉండగా, ఫైనాన్స్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 12నే కొత్త రిలీజ్ డేట్‌గా దాదాపు ఖరారైందని, ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన రావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్డేట్తో బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా… మరోవైపు చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం టెన్షన్‌లోకి వెళ్లారు.
‘అఖండ 2’ డిసెంబర్ 5 నుంచి 12కి మారడంతో, ముందే 12వ తేదీని లాక్ చేసుకున్న చిన్న సినిమాలకు భారీ గందరగోళం ఏర్పడింది. ఆ తేదీన సుమారు 8 చిన్న సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజున బాలయ్య హై వోల్టేజ్ సినిమాని ఎవరు ఎదుర్కోవాలంటే? బాక్సాఫీస్ రేసులో నిలవలేమన్న భయంతో ఒక్కొక్కటి వెనక్కి తగ్గుతున్నాయి.సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’ కూడా ఈ ప్రభావానికి గురైందని సమాచారం. ఇప్పటికే భారీ ప్రమోషన్లు చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘అఖండ 2’తో పోటీ సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గినట్టుగా ఇండస్ట్రీ టాక్.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ‘మోగ్లీ’ని 2026 ఫిబ్రవరికి మార్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దర్శకుడు సందీప్ రాజ్ ఈ నేపథ్యంలో చేసిన భావోద్వేగ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.“రిలీజ్ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది… బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చేమో” అంటూ తన మనసులోని బాధ బయటపెట్టారు. ‘కలర్ ఫోటో’ ఓటీటీలో విడుదలైందని, ఇప్పుడు ‘మోగ్లీ’ కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మోగ్లీ’తో పాటు అదే తేదీన రావాల్సిన మరో చిన్న చిత్రం ‘ఈషా’ కూడా వాయిదా పడినట్లు సమాచారం. అయితే కార్తీ – కృతి శెట్టిలు నటించిన ‘అన్నగారు వస్తారు’ మాత్రం డిసెంబర్ 12కే వస్తుందా? లేక రీషెడ్యూల్ అవుతుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు.