Akhanda 2 | అన్ని అడ్డంకులను అధిగమించి నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా బాలయ్య రుద్ర తాండవం థియేటర్లను దద్దరిల్లేలా చేస్తుండగా, ఆయన యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్, పవర్ఫుల్ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను గత చిత్రాల మాదిరిగానే ఈసారి కూడా భారీ క్యాస్టింగ్‌తో అఖండ 2ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త మేనన్ హీరోయిన్గా నటించగా, బజరంగీ భాయిజాన్ ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ముఖ్యంగా సినిమాలో పలువురు విలన్లు ఉండగా, వారిలో ఆది పినిశెట్టి పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాంత్రికుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించిన ఆహార్యం, లుక్ థియేటర్లలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి.అయితే ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న తాంత్రికుడి పాత్రకు ఆది పినిశెట్టి ఫస్ట్ ఛాయిస్ కాదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పాత్ర కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ముందుగా మంచు మనోజ్‌ను సంప్రదించారట. బోయపాటి స్వయంగా కథను కూడా వినిపించగా, అప్పటికే మనోజ్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉండటంతో ఈ సినిమాను చేయలేకపోయాడట. ఆ తర్వాత మరికొందరు హీరోలను కలిసినా, ఎవరూ ఆసక్తి చూపలేదని సమాచారం. చివరికి ఈ పాత్ర ఆది పినిశెట్టికి చేరిందట.
అతని సన్నిహితులు కూడా ఈ క్యారెక్టర్ చేయమని సూచించడంతో, ఆది వెంటనే కథ విని నటించేందుకు ఓకే చెప్పాడట. అలా అఖండ 2లో తాంత్రికుడి పాత్రకు ఆది పినిశెట్టి ఫైనల్ అయ్యాడు. ఇదివరకు బోయపాటి శ్రీను–అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలోనూ పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించి మెప్పించాడు. ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న అతడు, ఇప్పుడు అదే దర్శకుడి చిత్రంలో తాంత్రికుడిగా మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను భయపెడుతూ ఆకట్టుకుంటున్నాడు. అఖండ 2 విజయంలో బాలయ్యతో పాటు విలన్ల పాత్రలు కూడా కీలకంగా మారాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.