Akhanda 2 | టాలీవుడ్ మాస్ యాక్షన్ జానర్లో భారీ అంచనాలు సెట్ చేసిన నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ రేపటి నుంచే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ వాయిదా పడిన తర్వాత మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. చివరకు డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోలు, 12 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించడంతో, ఇప్పటికే ఆ తేదీకి షెడ్యూల్ చేసుకున్న పలు చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చేసుకోక తప్పలేదు. అఖండ 2 రిలీజ్ డేట్‌ను ప్రకటించే వరకు ఇతర సినిమాలన్నీ సస్పెన్స్‌లో పడిపోయాయి.
అఖండ 2..డిసెంబర్ 12కా లేదంటే , క్రిస్మస్ సీజన్లో విడుదలవుతుందో తెలియక ఆ సమయంలో రిలీజ్‌కి సిద్ధమైన పలు సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాలా లేదా అనే సందిగ్ధతలో ఉన్నాయి. ఆ సమయంలో, బాలయ్య సినిమాపై క్లారిటీ వచ్చిన వెంటనే కొన్ని నిర్మాణ సంస్థలు తమ ప్లాన్లను మార్చేశాయి. డిసెంబర్ 12న రావాల్సిన రోషన్ కనకాల–సందీప్ రాజ్ కాంబినేషన్ చిత్రం ‘మోగ్లీ’ (Mowgli) ఒక రోజు వెనక్కి తగ్గి డిసెంబర్ 13కి మారింది. నందు నటించిన ‘సైక్ సిద్ధార్థ్’ అయితే ఏకంగా నూతన సంవత్సర కానుకగా జనవరి 1 న రిలీజ్‌కి సిద్ధమైంది.ఇక ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం కూడా చేరింది.
రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు స్టేట్స్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ‘శివాజీ’ ని రీరిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని అఖండ 2 ప్రభావంతో ఆ చిత్రం కూడా వాయిదా పడింది. ఈ పరిణామాలు చూస్తుంటే మార్కెట్లో అఖండ 2 హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. బాలయ్య–బోయపాటి కాంబో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన నేపథ్యంతో ఈ సినిమా పై అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే వారం ఆలస్యంగా వస్తున్న అఖండ 2 ఈ భారీ హైప్‌ను నిలబెట్టుకుంటుందా? బాక్సాఫీస్ వద్ద అదే స్థాయి తాండవం చేస్తుందా? అన్నది మరో కొద్ది గంటల్లోనే తేలనుంది.