‘నాన్న పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఇప్పట్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. నాకు నేను హీరోగా ఎదిగాకే నాన్న దర్శకత్వంలో సినిమా చేస్తా.’ అన్నారు ఆకాష్ పూరీ. ప్రతిష్టాత్మకంగా మొదలైన పురుషుల వస్త్రవ్యాపార సంస్థ ఆర్.సి.ట్రెండ్ సెట్టర్స్కి ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూరీ ఆకాష్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
‘ఈ సంస్థవారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రచారకర్తగా కరెక్ట్ కాదని వాళ్లకు చెప్పాను. ఎందుకంటే నేనెప్పుడూ క్యాజువల్స్లోనే ఉండటానికి ఇష్టపడతాను. కానీ వీళ్ల మెన్స్‌వేర్ బ్రాండ్స్ చూశాక వీళ్ల ప్లానింగ్, లక్ష్యం నాకర్థమైంది. అందుకే ఒప్పుకున్నాను. రీసెంట్గా బ్రాండ్‌ను లాంచ్ చేస్తూ ఇచ్చిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు ఆకాష్. ఇంకా చెబుతూ ‘ ‘చిరంజీవిగారు చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
కానీ ఆయన నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు..’ అని మా నాన్న చెప్పిన మాట నాకెంతో స్పూర్తినిచ్చింది. నా సినిమాలు ఫ్లాపులైనా నటుడిగా నేను ఫ్లాప్ కాలేదు. కచ్చితంగా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తాను. కథలు వింటున్నాను. ఓ లవ్‌స్టోరీ, ఓ యాక్షన్ సబ్జెక్ట్‌లను ఓకే చేశాను. ఇకనుంచి అందరికీ నచ్చే సినిమాలే చేస్తా’ అని తెలిపారు ఆకాష్. నాన్న పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’, బాబాయ్ ‘వెయ్ దరువెయ్’ సినిమాలకోసం తాను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.