Ajith | కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఎక్కడ కనిపించినా అక్కడ వేలాది మంది అభిమానులు చేరడం సహజం. ఆయనకు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక సినిమాలపైనే కాకుండా రేసింగ్ పైన కూడా అజిత్‌కి ఉన్న ప్యాషన్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన కార్ రేసింగ్ టోర్నమెంట్లో పాల్గొన్న సందర్భంలో అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే వారి ఉత్సాహం ఈవెంట్‌ను డిస్టర్బ్ చేయడంతో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానులు హద్దులు దాటేలా ప్రవర్తించవద్దు , అవాంఛనీయ సంఘటనలు ఇతర టీమ్‌లకు ఇబ్బంది కలిగిస్తాయని అజిత్ సున్నితంగా హెచ్చరించాడు.
ఇలా ప్రవర్తించడం వలన నా రిప్యుటేషన్ మాత్రమే కాదు, మన అందరి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటుంది అని అభిమానులకు సూచించాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులను చాలా ప్రశాంతంగా హ్యాండిల్ చేసే అజిత్కూడా ఈసారి అభిమానుల అత్యుత్సాహంతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ పలువురు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అజిత్ సినిమాల కంటే ఎక్కువగా రేసింగ్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నాడనే అభిప్రాయం అభిమానుల్లో వినిపించింది. అయితే రేసింగ్ తన జీవితకాల హాబీ అని, సినిమాలతో పాటు దానిని ఎప్పటికీ పక్కన పెట్టబోనని ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న అజిత్ పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఒక రేసింగ్ ఈవెంట్లో అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది. గాయాలపాలైనా కూడా తన టీమ్‌తో కలిసి టోర్నమెంట్‌ను పూర్తి చేశాడు. ఆ ఈవెంట్లో అజిత్ టీమ్ టాప్‌లో నిలవడం విశేషం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇండియా పేరును గర్వంగా వినిపించడంలో అజిత్ కీలక పాత్ర పోషించాడు.రేసింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ అజిత్ సినిమాలను కూడా వరుసగా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయన చేసిన రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తమిళనాడులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆయన తాజా సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. ఒకప్పుడు తెలుగులో కూడా భారీ మార్కెట్ కలిగిన అజిత్ ఇటీవల తమిళ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమవుతున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.