Ajith Kumar | తమిళంతో పాటు తెలుగులోను స్టార్డమ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న అజిత్ ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. విడముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో విడముయర్చి సినిమా మిశ్రమ స్పందనను పొందింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం మంచి విజయాన్ని సాధించింది. అజిత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలో పలుమార్లు గాయపడ్డాడు కూడా. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పద్మ భూషణ్ అవార్డును ఆయనకి అందించడం జరిగింది.
అయితే అజిత్ సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలని ఖండిస్తూ ఈ ఏడాది నవంబర్ నెలలో తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో పుకార్లకి పులిస్టాప్ పడ్డట్టు అయింది. ఏకే 64గా రానున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్‌లో ప్రారంభంకానున్నట్లు సమాచారం. తనకు రేసింగ్, సినిమాలు రెండు ఇష్టమేనని.. కానీ రెండు ఒకేసారి చేయడం వలన రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని అజిత్ చెప్పుకొచ్చాడు . ఈ సందర్భంగా తాను, రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కూడా వెల్లడించారు
ఇక ఇదిలా ఉంటే ఇటీవల అజిత్ లుక్‌లో కొంత మార్పు వచ్చింది. ఆయన కార్ రేసుల్లో పాల్గొనడానికి 42 కిలోల బరువు తగ్గారు. కార్ రేస్ ప్రాక్టీస్ చేస్తున్న అజిత్ ఫోటోలు, వీడియోలు వైరల్ కాగా అవి చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. రేసుల్లో పాల్గొనడానికి ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకుని, గత ఎనిమిది నెలల్లో 42 కిలోలు తగ్గినట్లు చెప్పారు. డైట్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేశానని, టీ, కాఫీ మానేసినట్లు తెలిపారు.అజిత్ ఈ వయస్సులో ఇంత రిస్క్ చేయడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు.