Ajith Kumar | తమిళ అగ్రనటుడు అజిత్ మరోసారి ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెండు నెలల క్రితం దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు ముందు భాగం ఛిద్రం కాగా, అజిత్ మాత్రం సురక్షితంగా బయట పడ్డారు. మళ్లీ రెండు నెలలు తిరగక ముందే అజిత్‌కి స్పెయిన్‌లో అలాంటి ప్రమాదమే ఎదురైంది. అక్కడ జరుగుతున్న రేసింగ్‌లో వేగంగా కారు నడుపుతూ, మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా కారు నుంచి బయటకు వచ్చేశారు. సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు.
ఈ వీడియోను ‘అజిత్ కార్ రేసింగ్ టీమ్’ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అజిత్ సురక్షితంగానే ఉన్నారని ఈ పోస్ట్ ద్వారా వారు తెలిపారు. ప్రమాదంలో అజిత్ తప్పేం లేదని, ఇతర కారు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని వారు పేర్కొన్నారు. ప్రమాదానంతరం అజిత్ కారు నుంచి బయటకు వచ్చి, అభిమానులతో ఫొటోలు దిగారు. రేసింగ్‌పై ఎంత ఇష్టమున్నా ఇంత తెగువ పనికిరాదని, కుటుంబ క్షేమాన్ని, వయసును కూడా పరిగణనలోకి తీసుకొని అజిత్ ప్రవర్తిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.