Ajith | తన విజయాల వెనుక భార్య షాలిని హస్తం ఎంతో ఉందని చెబుతూ ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారన్న విషయంపై స్పందించారు. భార్య షాలిని సహకారం లేకపోతే తాను ఇంతదూరం రావడం సాధ్యపడేదికాదని అజిత్ స్పష్టంగా పేర్కొన్నారు. “మేము 2002లో పెళ్లి చేసుకున్నాం. అప్పటినుంచి ఆమె నాకు బలంగా నిలిచింది. నేను రేసింగ్‌కు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆమె నాతోపాటే వచ్చేది. ఇంటి విషయాలు, పిల్లల సంరక్షణ, నా పనులపై దృష్టి అన్నింటినీ సమర్థంగా నిర్వహించేది అని ఆయన అన్నారు.
పిల్లలు పుట్టిన తర్వాత షాలిని ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయినా, మోటార్ స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని మాత్రం కొనసాగిస్తోందని తెలిపారు. తన కుమారుడు గో-కార్టింగ్ ప్రారంభించిన విషయాన్ని వెల్లడించిన అజిత్, “అతను రేసింగ్‌ను కొనసాగిస్తాడో లేదో అతడే నిర్ణయించాలి. సినిమాలు అయినా, రేసింగ్ అయినా – నేను నా అభిప్రాయాలను పిల్లలపై రుద్దను. వారు తమ ఇష్టమైన దారిని ఎంచుకోవాలి. వారికి నేను పూర్తి మద్దతు ఇస్తాను,” అని అన్నారు. వృత్తిపరంగా తరచూ ప్రయాణాల్లో ఉండడం వల్ల పిల్లలతో గడిపే సమయం కొంత మేర కోల్పోతున్నానని, కానీ నిజంగా ప్రేమించే పనిని చేస్తే కొన్ని త్యాగాలు అవసరమేనని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ప్రొఫెషనల్ రేసర్‌గా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన అజిత్ ఇటీవల 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్ పోటీలో తన జట్టుతో కలిసి మూడో స్థానం సాధించగా, ఇటలీలో జరిగిన 12H రేస్‌లోనూ మూడో స్థానం దక్కించుకున్నారు. సినిమాల పరంగా ఈ ఏడాది ‘పట్టుదల’ మరియు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, త్వరలో తన తదుపరి సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. రేసింగ్ ట్రాక్‌లో వేగంగా పరిగెత్తే అజిత్, జీవితాన్ని మాత్రం నెమ్మదిగా, విలువలతో, ప్రేమతో నడిపించడంలోనూ ముందున్నారు.