నటీనటులు :
అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి
రైటర్, డైరెక్టర్ : శివ పాలడుగు
నిర్మాతలు : హర్ష గారపాటి, రంగారావు గారపాటి
కెమెరా: శ్రీనివాస్ బెజుగం,
మ్యూజిక్ డైరెక్టర్: పవన్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మ్యానరిజంతో ఎంటర్టైన్ చేసే అతికొద్ది మంది నటుల్లో టాప్‌లో ఉంటారు అజయ్ ఘోష్ (Ajay ghosh). కథను నమ్మి నటనకు ఆస్కారమున్న సినిమాలు చేసే భామల జాబితాలో ముందువరుసలో ఉంటుంది చాందినీ చౌదరి. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అదే మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy).
కథ ఏంటంటే..?
సంగీతమంటే పడిచచ్చిపోయే వ్యక్తి మూర్తి. చిన్నతనం నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతో మ్యూజిక్ షాప్ నిర్వహిస్తుంటాడు. అయితే కుటుంబం గడవడానికి మ్యూజిక్ షాప్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోదు. దీంతో కుటుంబసభ్యులు షాప్‌ను మూసేయాలని మూర్తిని కోరుతారు. ఆదాయం పెంచుకునేందుకు మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ షాప్ పెట్టుకుందామని భార్య (ఆమని) భర్త మూర్తితో తరచూ గొడవ పడుతుంది. ఈ నేపథ్యంలో తన ఆదాయం పెంచుకోవాలా అని ఆలోచిస్తున్న క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో మూర్తి ఇక తాను డీజే కావాలని బలంగా ఫిక్స్ అవుతాడు.
మరోవైపు అంజనా (చాందినీ చౌదరి) డీజే కావాలని కలలు కంటుంది. అయితే ఇది నాన్న (భానుచందర్)కు నచ్చదు. దీంతో అతడు కోపంతో డీజే వస్తువొకటి పగలగొడతాడు. ఈ వస్తువును రిపేర్ చేసే క్రమంలో మూర్తి, అంజనాకు మధ్య పరిచయం ఏర్పడుతుంది. తనకు డీజే నేర్పిస్తానంటేనే ఆ పరికరాన్ని బాగు చేస్తానని అంజనాకు షరతు పెడతాడు మూర్తి. మరి మూర్తికి అంజనా డీజే నేర్పించిందా..? ఇంతకీ మూర్తి డీజేగా మారాడా..? డీజేగా మారేందుకు మూర్తి హైదరాబాద్‌కు వచ్చి పడ్డ కష్టాలేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటుల పనితీరు :
ఇప్పటిదాకా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన అజయ్ ఘోష్.. 50 ఏండ్ల మధ్యతరగతి వ్యక్తిగా తొలిసారి లీడ్ రోల్లో కనిపించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. మ్యూజిక్ షాప్ నిర్వహించే మూర్తిగా ఓ వైపు .. డీజేగా మారే వ్యక్తిగా మరోవైపు అజయ్ ఘోష్ నటన అందరినీ ఇంప్రెస్ చేసేలా సాగుతూ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది. ఆమని, భానుచందర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
బలం :
డీజే కావాలని కలలు కనే మ్యూజిక్ షాప్ యజమానిగా అజయ్‌ఘోష్.. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో అతనికి సాయం చేసే స్పూర్తివంతమైన పాత్రలో చాందిని చౌదరి నటన ఆకట్టుకుంటాయి. ఈ ఇద్దరి యాక్టింగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. పవన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
బలహీనతలు :
నిదానంగా సాగే కథనం..
టెక్నికల్‌గా..
కెమెరామెన్ శ్రీనివాస్ బెజుగం పనితనం ఇంప్రెస్ చేసేలా ఉంది. సినిమా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ శివ పాలడుగు డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడనే చెప్పాలి.
రేటింగ్ : 3/5