Ajay Devgn | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’తో ఈ సీరీస్‌కు ఘనమైన ముగింపు పలకనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘దృశ్యం 2’ తర్వాత కథను ముందుకు తీసుకెళ్లడం కష్టతరమైన సవాల్‌గా మారినప్పటికీ, సరైన కథ దొరకడంతో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించినట్లు అజయ్ దేవగన్ తెలిపారు. సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, కథను అనవసరంగా సాగదీయకుండా సరిగ్గా ముగించాలనే ఉద్దేశంతోనే మూడో భాగాన్ని తెస్తున్నామని స్పష్టం చేశారు. దర్శకుడు అభిషేక్ పాఠక్ సుమారు రెండేన్నర సంవత్సరాలు కష్టపడి అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, ఈ చిత్రం ప్రేక్షకులకు మునుపటిలాగే అదిరిపోయే ట్విస్టులు ఇస్తుందని పేర్కొన్నారు.
మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఒరిజినల్ ‘దృశ్యం’ చిత్రాల స్ఫూర్తితోనే హిందీలో ఈ రీమేక్స్ రూపొందినప్పటికీ, ‘దృశ్యం 3’ మాత్రం మలయాళ వెర్షన్‌కు పూర్తిగా భిన్నమైన స్క్రిప్ట్‌తో తెరకెక్కుతోందని అజయ్ దేవగన్ స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆద్యుడైన మోహన్‌లాల్ సర్ ఈ సినిమాను వీక్షించాలని తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, ఆయనకు ఈ చిత్రాన్ని చూపించాలనే కోరిక బలంగా ఉందని అజయ్ దేవగణ్ తన మనసులోని మాటను పంచుకున్నారు.