Ajay Devgn | హైదరాబాద్‌ను హాలీవుడ్, బాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముందడుగు పడింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్‌సిటీ స్థాపనకు ముందుకు రావడంతో, ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో త్వరలోనే అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఈ పరంపరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
జూలై లో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అజయ్ దేవగణ్, తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి అనుమతులు, అవసరమైన సహకారం అందించాలని కోరిన విషయం తెలిసిందే.ఆయన ప్రతిపాదించిన ముఖ్య అంశాలు యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఐ ఆధారిత అత్యాధునిక స్టూడియో నిర్మాణం, ప్రపంచ స్థాయి షూటింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు, ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాల కోసం ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు. అలానే సినిమా, మీడియా రంగాలకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంబాసిడర్‌గా తన సేవలు అందిస్తానని కూడా అజయ్ దేవగణ్ అన్నారు.
2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చాప్టర్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఇందుకోసం సినీ ప్రముఖుల సూచనలు, ప్రణాళికలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అజయ్ దేవగణ్ ప్రతిపాదించిన ఫిల్మ్‌సిటీ అమలుకావడం వల్ల పెద్దసంఖ్యలో ఉద్యోగాల సృష్టి ఏర్పడుతుంది. దేశీయ, విదేశీ చిత్ర నిర్మాణ సంస్థల ఆకర్షణ, టెక్నాలజీ ఆధారిత క్రియేటివ్ ఇండస్ట్రీలకు కొత్త అవకాశాలు, హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఎంఓయూ అమలు అయితే, హైదరాబాద్ సినిమాటిక్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ సినిమా ప్రొడక్షన్లకు కేంద్ర బిందువుగా మారడానికి పెద్ద పునాది పడనుంది.