De De Pyaar De 2 Trailer | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘దే దే ప్యార్ దే’ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే చిత్రానికి సీక్వెల్‌ను తీసుకువచ్చారు మేకర్స్. ‘దే దే ప్యార్ దే 2’ అంటూ ఈ చిత్రం రాబోతుండగా నవంబర్ 14 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశీష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్తో పాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ సీక్వెల్లో ఆశీష్ ఆయేషా కుటుంబాన్ని ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో కామెడీ ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సీక్వెల్లో ఆయేషా తండ్రి పాత్రలో నటుడు ఆర్. మాధవన్ కనిపించబోతున్నాడు. అల్లుడిగా తన వయసున్న వ్యక్తిని అంగీకరించడానికి మాధవన్ నిరాకరించడంతో కథలో కామెడీ డ్రామా మొదలవుతున్నట్లు తెలుస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ను అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. లవ్ రంజన్ ఈ చిత్రానికి కథ అందించారు.