Aishwarya Rajesh | ‘సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు. అదొక గొప్ప అదృష్టం. ఉత్తమమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్ని పోషించాలనుకుంటున్నా. ఏ పాత్ర చేసినా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది ఐశ్వర్య రాజేష్. ఆమె వెంకటేష్ సరసన కథానాయికగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఐశ్వర్యరాజేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమా నరేషన్ టైంలో నవ్వాపుకోలేపోయా. అంత గొప్పగా కామెడీ పండింది.
ఈ సినిమాలో నేను భాగ్యం అనే ఇల్లాలి పాత్రలో కనిపిస్తా. భిన్న భావోద్వేగాలతో సాగే పాత్ర ఇది. ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అందుకే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచేందుకు ప్రయత్నించా’ అని చెప్పింది. వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ‘భాగ్యం క్యారెక్టర్లో అదరగొడుతున్నావ్’ అంటూ ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేవారని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.
సినిమాలోని ‘గోదారి గట్టు..’ పాట బాగా పాపులర్ అయిందని, గతంలో ఎయిర్పోర్ట్కి వెళితే తనను అంతగా గుర్తుపట్టేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనిపిస్తే చాలు చుట్టూ చేరి ఫొటోలు తీసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేసింది. భాగ్యం వంటి పాత్ర గత ఐదారేళ్లుగా తెలుగు సినిమాలో రాలేదని, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అందరినీ ఆకట్టుకుంటుందని ఐశ్వర్య రాజేష్ చెప్పింది.