Akkineni Akhil | అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ప్రధాన పాత్రలో నటించిన ‘ఏజెంట్’ (Agent) చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. హోలీ పండుగ కానుకగా మార్చి 14న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించిన సోనిలివ్ ఒకరోజు ముందుగానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం సోనీ లివ్ వేదికగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టార్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌కి సురేందర్ రెడ్డి, అఖిల్ ఇంకో సినిమాకు కూడా సంతకం చేయలేదంటే ఆ సినిమా డిజాస్టార్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక గత రెండు ఏండ్లుగా ఊరిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా చూద్దామనుకున్న మూవీ లవర్స్ ఆలస్యం చేయకుండా చూసేయండి మరి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రిక్కీ అలియాస్ రామకృష్ణకు (అఖిల్) స్పై అవ్వాలన్నదే జీవితాశయం. భారత గూఢచార సంస్థ ‘రా’లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉంటాడు. అందుకోసం ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్షలు రాసి విఫలమవుతాడు. అయితే ఎలాగైనా తాను ‘రా’ అధికారుల దృష్టిలో పడాలని ఎథికల్ హ్యాకింగ్‌కు పాల్పడతాడు. ‘రా’ అధిపతి డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) కంప్యూటర్ను హ్యాక్ చేసి ఆయన మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అవి కూడా ఫలించకపోవడంతో రిక్కీ నిరాశకు గురవుతాడు. మరోవైపు ‘రా’ మాజీ ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ (డినో మోరియా) సిండికేట్‌ను ఏర్పాటు చేసుకొని శత్రుదేశాల సహాయంతో ఇండియాను నాశనం చేయాలని చూస్తుంటాడు. గాడ్ కుట్రలను ఛేదించడానికి రిక్కీని రంగంలోకి దింపుతాడు మహదేవ్. గాడ్ పన్నాగాలకు రామకృష్ణ ఎలా అడ్డుకట్ట వేశాడు ? అసలు ‘రా’ మాజీ ఏజెంట్ అయిన గాడ్ దేశంపై ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు? ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి జయకిషన్ (సంపత్‌రాజ్) పాత్ర ఏమిటి? ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసే క్రమంలో రామకృష్ణకు ఎదురైన సవాళ్లేమిటన్నదే మిగతా చిత్ర కథ..