 
                                                            Amitabh Bachchan | ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్పై ఖలిస్థానీ ఉగ్రవాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తీవ్ర విమర్శలు, బెదిరింపులకి దిగిన విషయం తెలిసిందే. ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్పతి 17’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దిల్జిత్, వేదికపై బిగ్ బీకి పాదాభివందనం చేశారు. ఈ క్షణం సోషల్ మీడియాలో వైరల్ కాగా, దిల్జిత్ వినయానికి అభిమానులు ప్రశంసలు కురిపించినా, పన్నూన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. “1984లో సిక్కుల మారణహోమానికి బాధ్యత వహించినవారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఆయన కాళ్లు మొక్కడం అనేది చరిత్రను అవమానించడం, బాధితులకు ద్రోహం చేయడం. నవంబర్ 1న సిక్కుల స్మారక దినోత్సవం రోజున మనస్సాక్షి ఉన్న ఎవరైనా సిక్కు వేదికపై ప్రదర్శన ఇవ్వరు అని పన్నూన్ హెచ్చరించాడు.
అంతేకాక, ఎస్ఎఫ్జే సంస్థ ఆస్ట్రేలియాలో నవంబర్ 1న జరగనున్న దిల్జిత్ సంగీత కచేరీని అడ్డుకుంటామని ప్రకటించింది. అలాగే సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అకల్ తఖ్త్ జతేదార్కు లేఖ రాసి, దిల్జిత్ను పిలిపించి వివరణ కోరాలని డిమాండ్ చేసింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు జరిగాయి. ఆ ఘటనలను సిక్కు సమాజం ఇప్పటికీ “మారణహోమ మాసం”గా గుర్తిస్తుంది. ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ, దిల్జిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన ‘ఆరా టూర్’ లో బిజీగా ఉన్నారు. సిడ్నీలో జరిగిన ఆయన కచేరీకి 30,000 మందికి పైగా అభిమానులు హాజరై రికార్డు సృష్టించారు. టికెట్లు మొత్తం అమ్ముడైపోగా, కొన్ని టికెట్లు 800 డాలర్ల వరకు విక్రయం జరిగింది.
అయితే పన్నూన్ వార్నింగ్తో అమితాబ్ భద్రతపై సెంట్రల్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ క్రమంలో ఆయనకు భారీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తానికి, దిల్జిత్–అమితాబ్ ఘటనతో మరోసారి 1984 సిక్కుల మారణహోమం చర్చల్లోకి వచ్చింది, కాగా ఈ వివాదం పై సిక్కు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
 
                            