Meenakshi Chaudhary | పంజాబీ సొగసరి మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో భారీ అవకాశాలతో సత్తా చాటుతున్నది. టాలీవుడ్లో రెండేళ్ల క్రితమే అరంగేట్రం చేసినప్పటికీ ఈ ఏడాది మాత్రం ఈ అమ్మడికి బాగా కలిసొచ్చింది. మహేష్‌బాబు సరసన ‘గుంటూరు కారం’లో నాయికగా చోటు దక్కించుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుణ్‌తేజ్, విశ్వక్సేన్ చిత్రాల్లో కథానాయికగా ఖరారైంది. ఇదే జోరులో ఈ భామ తమిళంలో దళపతి విజయ్ సరసన నటించే బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది.
విజయ్ తాజా చిత్రం ‘లియో’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా అనంతరం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని రెండో నాయికగా ఎంపిక చేశారు. ప్రధాన హీరోయిన్గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. రెండో పాత్రకు జోడీగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.