Allari Naresh | నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి హస్య నటుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరినరేష్. గతేడాది ‘నాంది’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నరేష్ ప్రస్తుతం అదే జోష్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన మారేడుమిల్లి ప్రజానీకం కమర్షియల్ సక్సెస్ కాకపోయిన, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం నరేష్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. ఇదిలా ఉంటే నరేష్ మరో స్టార్ హీరో సినిమాలో కీలకపాత్ర చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
గతంలో నరేష్ ‘మహర్షి’ సినిమాలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మహేష్ స్నేహితుడిగా, ఊరి కోసం పోరాడే వ్యక్తిగా నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ సినిమా నరేష్‌కు అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కాగా తాజాగా నరేష్ మరో అగ్ర హీరోతో కలిసి నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా పరిచయమవుతూ నాగార్జునతో ఓ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్లాన్ చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో నాగార్జునకు సమానంగా మరో ముఖ్య పాత్ర ఉండనుందట. ఇక ఆ పాత్ర కోసం ప్రసన్న కుమార్, నరేష్‌ను సంప్రదించాడట. నరేష్ కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం నరేష్ నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో రెండో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటుగా నరేష్ నటించిన ‘సభకు నమస్కారం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.