No Ticket Hikes | కూలీ, వార్ 2 సినిమాలకు తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచబోతున్నట్లు సోమవారం సాయంత్రం నుంచి వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై అటు అభిమానులతో పాటు మువీ లవర్స్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచి ఈ దోచుకోవడం ఏంటి అని సోషల్ మీడియాలో నిర్మాతలతో పాటు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో టికెట్ ధరలపై నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సాధారణ టికెట్ ధరలకే ఈ సినిమా టికెట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లో అప్డేట్ రానుంది. మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి ఈ రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే.. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ సినిమాతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న వార్ 2 చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కూలీ సినిమాకు తమిళనాడులో అత్యధిక టికెట్ ధర రూ.190 రూపాయలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఆ ధర దాదాపు రూ.450 నుంచి రూ.500 వరకు వెళుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిందీ నుంచి వస్తున్న డబ్బింగ్ చిత్రం వార్ 2 కి కూడా హిందీలో రూ.250 టికెట్ రేట్లు ఉండగా.. తెలంగాణలో రూ.400 వరకు ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే రేట్లు కొనసాగితే.. భవిష్యత్తులో ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేసి.. ఓటీటీ లేదా.. పైరసీ వెబ్సైట్లకు అలవాటుపడతారని విశ్లేశకులు భావిస్తున్నారు.