Pooja Hegde | ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలని అందిపుచ్చుకోలేకపోయింది. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన పూజా హెగ్డేకి ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఆఫర్సే లేవు. పూజా తెలుగులో సినిమా చేయక మూడేళ్లు అవుతుంది. పూజా హెగ్డేకి డీజే దువ్వాడ జగన్నాథం సినిమా మంచి గుర్తింపు తీసుకు రాగా, ఆ తర్వాత అల వైకుంఠపురములో అద్భుతంగా నటించి బుట్టబొమ్మగా అందరి మనసులలో నిలిచింది. పూజా నటించిన అరవిందసమేత వీరరాఘవ, మహర్షి లాంటి చిత్రాలు హిట్స్ కావడంతో పూజా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది.
అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజా హెగ్డేకి ఒక్క హిట్ రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య నిరాశ పరచగా డబ్బింగ్ మూవీ బీస్ట్ తో పాటు హిందీ సినిమాలు సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు మే 1న రిలీజ్ కాబోతున్న సూర్య రెట్రో సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. పూజా రెట్రో చిత్రంతో పాటు విజయ్‌తో `జన నాయగన్` చిత్రంలో నటిస్తుంది. `కాంచన 4`లోనూ నటిస్తుంది. మరోవైపు `కూలీ`లో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే ఓ హిందీ మూవీలో కూడా నటిస్తుంది. ఇప్పుడు పూజా చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయితే మే 1 రిలీజ్ కాబోతున్న రెట్రో మీద చాలా ఆశలు పెట్టేసుకుంది.
ఈ సందర్భంగా టీమ్ లో అందరికంటే ముందుగా తెలుగు ప్రమోషన్లు మొదలుపెట్టింది బుట్టబొమ్మ. ఈ క్రమంలో పూజా హెగ్డేకి టాలీవుడ్లో ఎప్పుడు సినిమా చేయబోతున్నారన్న ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా అల వైకుంఠపురములో సినిమాలో చెప్పినట్లుగా నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది. నేను ఏదైనా డిఫరెంట్ గా, కొత్తగా చేయాలని అనుకుంటున్నా. చాలా కథలు విన్నాను కానీ.. ఇప్పటివరకూ నాకు ఏదీ అంతగా కనెక్ట్ కాలేదు. ఈసారి నేను చేసే సినిమా తప్పకుండా బాగుండాలని, వైవిధ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొంది. అయితే త్వరలో పూజా ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని, హైదరాబాద్ ని సొంత ఇల్లులా ఫీలవుతానని కూడా చెప్పుకొచ్చింది. మూడేళ్ల తర్వాత పూజా తెలుగు ప్రేక్షకులని పలకరించనుందని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.