బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం ప్రతి ఒక్కరిని కలచివేసింది. కెరీర్‌లోని వైఫల్యాల్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిన ఆయన 2020 జూన్‌లో ముంబయిలోని తన అద్దె ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ పరిశ్రమలోని బంధుప్రీతి, కొందరు నిర్మాతల గుత్తాధిపత్యంపై చర్చలకు తెర తీసింది. ఇదిలావుండగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆయన నివసించిన అద్దె ఫ్లాట్‌ను కిరాయి తీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి ఎవరూ రాకపోవడం చర్చనీయాశంగా మారింది.
ముంబయిలోని అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ విలాసవంతమైన భవనానికి ఓ ఎన్ఆర్ఐ యజమానిగా ఉన్నారు. అయితే ఈ ఫ్లాట్‌ను అమ్మేందుకు, కిరాయి ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదని ముంబయి రియల్ ఎస్టేట్ బ్రోకర్ రఫిక్ మర్చంట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అద్దె తగ్గించి కిరాయికి ఇస్తామని ప్రకటన చేసినా ఇప్పటివరకు ఒక్కరు కూడా ఫ్లాట్ గురించి వాకబు చేయలేదని ఆయన అన్నారు. ఆత్మహత్య ఘటన జరిగిన ఫ్లాట్‌లో ఉండటం అశుభంగా భావిస్తారని, అందుకే కిరాయి కోసం ఎవరూ రావడంలేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.