ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘సుబ్రహ్మణ్య’. తిరుమల్‌రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలు. దుబాయ్‌లో జరిగిన ప్రముఖ అవార్డు ఫంక్షన్లో ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. విషపూరిత పాములతో నిండిన బావిలోకి అద్వయ్ జంప్ చేయడంతో టీజర్ ఓపెన్ అయ్యింది. అతను దొంగచాటుగా లోపలికి ప్రవేశించి, ఓ పురాతన పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
ఇంతలో పాములన్నీ అతడ్ని వెంబడించాయి. అద్వయ్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. వీఎఫ్ఎక్స్, ఎనిమేషన్స్ హైలైట్‌గా ఆద్యంతం ఈ గ్లింప్స్ సాగింది. ఈ గ్లింప్స్‌లో భగవాన్ శ్రీరాముడు కనిపించిన చివరి సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పానిండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: విఘ్నేష్ రాజ్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ప్రవీణ కడియాల, రామలక్ష్మి, నిర్మాణం: ఎస్.జి.మూవీ క్రియేషన్స్.