Hit-2 Movie | టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివిశేష్ ప్రస్తుతం ‘మేజర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అడివిశేష్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. దాదాపు రూ.65కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్నీకృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. సందీప్ పాత్రలో అడివిశేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శేష్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ‘హిట్-2’ ఒకటి.
సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో వచ్చిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కాగా తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల వాయిదా పడనుందట. అయితే అడివిశేష్ కోరిక మేరకు నాని ఈ చిత్రాన్ని రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు టాక్.
అయితే దానికి కారణం ‘హిట్’ హిందీ రీమేక్ జూలై 15న విడుదల కానుంది. ఒకవేళ బాలీవుడ్లో హిట్ మంచి విజయం సాధిస్తే రెండు నెలల గ్యాప్‌లో ‘హిట్-2’ చిత్రాన్ని తెలుగుతో పాటే హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అంతేకాకుండా అడివిశేష్‌కు ప్రస్తుతం బాలీవుడ్లో కొంత ఇమేజ్ ఏర్పడింది. దాంతో హిట్-2ను పోస్ట్ పోన్ చేయాలని అడివిశేష్ నానిని కోరాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.