అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘హిట్ 2’. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకుడు. డిసెంబర్ 2న తెరపైకి రాబోతున్నది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ…‘నా కథల ఎంపిక బాగుంటుందని చెబుతుంటారు. ఓ మంచి చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు మేము చాలా కష్టపడుతుంటాం. ఈ సినిమాకు దర్శకుడు శైలేష్ ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలవగానే పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక ఆ కోరిక మరింత బలపడింది. ‘హిట్ 2’ కంటే రాబోతున్న ‘హిట్ 3’ ఇంకా భారీగా ఉంటుంది.
ఒక స్టార్ హీరో ఆ సినిమాలో నటిస్తారు. అందులోనూ నేను ఉంటాను. అన్నపూర్ణ సంస్థలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నా’ అని అన్నారు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ…‘ఈ సినిమా రిలీజ్ పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నాం. మా కథకు మంచి ప్రతిభ గల ఆర్టిస్టులు దొరికారు. నిర్మాత నాని మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. ఈ నిర్మాణ సంస్థకు రుణపడి ఉంటాను’ అని అన్నారు. ‘ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమాలో తర్వాత సన్నివేశం ఎం జరుగుతుంది అనేంత ఆసక్తిగా సినిమా సాగుతుంది. థియేటర్లో మూవీని ఆస్వాదిస్తారు అని నాయిక మీనాక్షి చౌదరి చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.