అంతర్జాతీయ ప్రమాణాలతో ‘డెకాయిట్’ చిత్రాన్ని తీశామన్నారు హీరో అడివి శేష్. షానియల్ డియో దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ లవ్, యాక్షన్ డ్రామా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రేమ, దోపిడీ ప్రధానాంశాలుగా సాగే ఈ కథలో అడివి శేష్ మాస్ అండ్ రగ్గ్డ్ పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ మల్టీషేడ్స్తో ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు రోమాంచితంగా సాగాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహనిర్మాత. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘దర్శకుడు షానియల్ డియో నా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం యూఎస్‌లో కలిసి పెరిగాం.
ఒకరి సంస్కృతిని ఒకరం అర్థం చేసుకొని మంచి హైబ్రిడ్ సినిమా చేశాం. తను సాంకేతికంగా హాలీవుడ్ స్టైల్లో తీశాడు. నాగార్జున ‘హలో బ్రదర్’ సినిమాలోని ‘కన్నెపెట్టరో కన్ను కొట్టరో..’ పాటను బీజీఎం కోసం ఉపయోగించాం’ అన్నారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించినా పేరు ముందు ట్యాగ్ ఎందుకు పెట్టుకోలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అడివి శేష్ బదులిస్తూ ‘చిన్నప్పుడే అమ్మానాన్న నాకు ‘అడివి శేష్’ అనే ట్యాగ్ ఇచ్చారు. అందుకే మరో ట్యాగ్ వద్దనుకున్నా. ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోవడం నాకు నచ్చదు. మంచి సినిమాలతో నటుడిగా గుర్తుండిపోవాలన్నదే నా అభిమతం’ అని చెప్పారు.