జగద్గురు ఆదిశంకరాచార్య జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘ఆదిశంకరాచార్య’ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను దసరా పర్వదినం రోజున ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆదిశంకరుడు భారతీయ ప్రాచీన వేద విజ్ఞానాన్ని పునరుజ్జీవింపజేసిన మహామనిషి అని కొనియాడారు. ఆదిశంకరుడి బాల్య జీవితం, భారతీయ ఆధ్యాత్మిక వైభవ పునరుద్ధరణకు ఆయన చేసిన కృషిని ఈ సిరీస్‌లో ఆవిష్కరించామని, మొదటి సీజన్లో 40 నిమిషాల నిడివిగల 10 ఎపిసోడ్లు ఉంటాయని, వీటిలో ఆదిశంకరుని జననం నుంచి ఎనిమిది ఏండ్ల వయసు వరకు జరిగిన సంఘటనలను చూపించామని చిత్ర బృందం తెలిపింది. భారతదేశ సాంస్కృతిక వికాసానికి ఆదిశంకరాచార్యులు చేసిన కృషి వెలకట్టలేనిదని ఈ సిరీస్ దర్శకుడు ఓంకార్‌నాథ్ మిశ్ర పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ యాప్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.