తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ భాగ్యనగరం ప్రేమలో పడిపోయిందట. ఈ ముత్యాల నగరం తనను మంత్రముగ్ధురాలిని చేసిందని..త్వరలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చుతానని చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటోకు ‘నా జీవితంలో సరికొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. హైదరాబాద్‌లో స్థిరపడిపోయినా కుటుంబాన్ని, స్నేహితుల్ని కలవడానికి మాత్రం తరచూ చెన్నై వెళ్తానని పేర్కొంది. ఇటీవల చెన్నైలో జరుపుకున్న పుట్టిన రోజు ఎన్నో మధుర జ్ఞాపకాల్ని మిగిల్చిందని వరలక్ష్మి శరత్‌కుమార్ ఆనందం వ్యక్తం చేసింది. ‘నేను హైదరాబాద్‌కు షిప్ట్ అవుతున్నా. ఆత్మీయులను వదిలిపెట్టి రావడం కాస్త బాధగా ఉంది. ఈ నిర్ణయం నా మంచి కోసమే అనుకుంటున్నా. ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని ఆమె పేర్కొంది. ‘క్రాక్’ ‘నాంది’ వంటి చిత్రాలతో వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘హను-మాన్’ ‘యశోద’ చిత్రాల్లో నటిస్తున్నది.