Actress Vahini | టాలీవుడ్లో సహాయ నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న వార్త పరిశ్రమలో కలకలం రేపుతోంది. 1978లో జన్మించిన వాహిని, టెలివిజన్ ప్రేక్షకులకు ‘జయ వాహిని’ పేరుతో బాగా దగ్గరైంది. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాల కంటే టీవీ సీరియల్స్‌లో ఆమె ప్రయాణం మరింత బలంగా కొనసాగింది. జెమిని, ఈటీవీ వంటి ప్రముఖ చానెల్స్‌లో ప్రసారమైన అనేక సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. ఇటీవల ఆమె ‘బహిర్భూమి’ అనే సినిమాలో కూడా కనిపించారు.
అయితే, ఈ టాలెంటెడ్ నటి ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి క్షీణించడంతో అవయవాల పనితీరులో లోపాలు కనిపించి ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, వాహినికి జరుగుతున్న నిరంతర చికిత్స, కీమోథెరపీ, శస్త్రచికిత్సలు, ఐసీయూ కేర్ కోసం ₹25 లక్షల నుంచి ₹35 లక్షల మధ్య ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సినీనటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో భావోద్వేగంతో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వాహిని తమ చిన్ననాటి స్నేహితురాలని, విజయనగరం లో మా ఇళ్లు పక్కపక్కనే ఉండేవని గుర్తుచేసుకున్న కల్యాణి, ఇప్పుడు జీవన్మరణ పోరులో ఉన్న వాహినికి పరిశ్రమ, అభిమానులు తప్పకుండా చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే వాహినికి సంబంధించిన ఫోన్‌పే, గూగుల్ పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా షేర్ చేస్తూ ఆమెను కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్ కావడంతో, “Let’s Save Vahini” హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనేక మంది ఆమెకు ఆర్థిక సహాయం చేస్తూ పంపిన స్క్రీన్షాట్లను పంచుకుంటున్నారు. తెరపై చిరునవ్వుతో, సహజమైన నటనతో అందరిని అలరించిన వాహిని నిజజీవితంలో ఆరోగ్యంతో మళ్లీ తిరిగిరావాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.