Sreeleela Bollywood | టాలీవుడ్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పుష్ప 2లోని కిస్సిక్ పాటకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న శ్రీలీలకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల, అనన్య పాండేలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రధాన హీరోయిన్గా శ్రీలీలకే అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్ శాండిల్య కామెడీ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు కావడంతో, ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని టాక్.
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా కనిపిస్తోంది. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం విడుదల కాకముందే మరో స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇక టాలీవుడ్‌లోనూ శ్రీలీల బిజీగానే ఉంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో కలిసి ‘మాస్ జాతర’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్టులు కూడా శ్రీలీల చేతిలో ఉన్నాయి. శ్రీలీల దూకుడు చూస్తుంటే, రష్మిక మందన్నలాగే ఆమె కూడా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందో లేదో వేచి చూడాలి.