Actress Rohini | తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రలంటే గుర్తొచ్చేది రోహిణియే. నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను అమ్మ పాత్రలతో మొదలుపెట్టిన రోహిణి ఇప్పటికీ అమ్మ పాత్రలను చేస్తూనే వున్నారు. ఎంతో సహజంగా అనిపించే తన నటనతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటిగా జాతీయస్థాయి గుర్తింపు పొందారు. అయితే రోహిణి కేవలం నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో ప్రతిభ చూపుతుంటారు. ఇటీవల తన కెరీర్ విషయాలను పంచుకున్న రోహిణి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. అందులో భాగంగానే రాంగోపాల్ వర్మ శివ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆమె షేర్ చేశారు.
” జంధ్యాల నాలుగు స్తంబలాట చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేస్తున్న పాణి మణిరత్నం తెలుగులో తెరకెక్కిస్తున్న గీతాంజలికి పనిచేశారు. ఆయన అడగటంతో అందులో హీరోయిన్ గిరిజకు డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలోని ‘లేచిపోదామా.. అనే నా డైలాగ్‌కి మంచి పేరొచ్చింది. అయినా మళ్లీ డబ్బింగ్ చెప్పకూడదని అనుకున్నా.
అయితే అదే సమయంలో గీతాంజలి సినిమాని చూసిన రామ్‌గోపాల్ వర్మ తన మొదటి సినిమా శివలో అమల పాత్రకి డబ్బింగ్ చెప్పామని అడిగాడు. అప్పటికీ నేను పనిచేస్తున్న మలయాళ సినిమాలకు భిన్నంగా వుండే తెలుగు, తమిళ చిత్రాల్లో వుండే మెలోడ్రామా నాకు నచ్చేది కాదు. అందుకే శివ సినిమాకు తొలుత నో చెప్పాను. అయితే వర్మ అసోసియేట్ దర్శకులు పట్టు వదలని విక్రమార్కుల్లా మరీ మరీ అడిగితే.. నాకు సినిమా చూపించి నచ్చితే చెబుతానని చెప్పాను. అలాగే చూపించారు. సినిమా చూడగానే ఇది మామూలు తెలుగు చిత్రం కాదని అప్పుడే అనిపించింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్‌హాఫ్ పూర్తికాగానే డబ్బింగ్ చెబుతానని ఒప్పుకున్నాను. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడం వల్ల నా నటన కూడా మెరుగుపడింది. ఇక అప్పట్నుంచీ వచ్చిన చిత్రాల్లో సెలెక్టివ్‌గా డబ్బింగ్ చెప్పాను’ అని చెప్పుకొచ్చారు రోహిణి