అగ్ర కథానాయిక నయనతార వివాహానికి ముహూర్తం దగ్గరపడుతున్నది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ఆమె వివాహం ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ జంట ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి వివాహ ఆహ్వన పత్రికను అందజేశారు. ఈ దర్శకనాయిక జోడీ పెళ్లి గురించి దక్షిణాది పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే తమ పెళ్లి గురించి నయనతార, విఘ్నేష్ శివన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విషయమై విఘ్నేష్‌శివన్ స్పందించారు.
సమయాభావం వల్ల పెళ్లికి సంబంధించిన వివరాల్ని మీడియాకు వెల్లడించలేకపోయామని ఆయన తెలిపారు. విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ ‘తొలుత తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ప్రయాణ పరమైన కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేదికను మహాబలిపురంకు మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించాం. వివాహానికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నంలోగా అందజేస్తాం. జూన్ 11న మేమిద్దరం మీడియా ముందుకొస్తాం. మీ అందరి ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పారు.