Moushumi Chatterjee | 1970లలో బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన నటి మౌషిమి ఛటర్జీ. ఆ సమయంలో బీటౌన్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నది. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి.. తోటి నటీనటులతో స్నేహపూర్వకంగా మెలగదనే విమర్శలు ఎదుర్కొన్నది. ఆ కారణంగానే పలు పెద్దపెద్ద ప్రాజెక్టుల నుంచి తనను తప్పించారని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
తాజాగా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, గొడవలు.. తదితర సంగతులను పంచుకున్నది. 1981లో అమితాబ్ హీరోగా వచ్చిన ‘బర్సాత్ కీ ఏక్ రాత్’ నుంచి తనను అర్ధంతరంగా తొలగించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. పలు విషయాలను వెల్లడించింది. 70లలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి మౌషుమి ఛటర్జీ మూడు చిత్రాలలో నటించింది. రోటీ కపడా ఔర్ మకాన్, బేనామ్, మంజిల్ చిత్రాలతో అమితాబ్ – మౌషుమీ జోడి.. హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది.
ఇదే క్రమంలో 1981లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘బర్సాత్ కీ ఏక్ రాత్’ కోసం హీరోయిన్గా మొదట మౌషుమినే తీసుకున్నారట. కానీ, షూటింగ్ మొదలుపెట్టే సమయానికి తనను కాదని బిగ్ బీ సరసన రాఖీ గుల్జార్‌ను ఎంపిక చేశారట. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత శక్తి సామంత్ తనకు ఫోన్ చేసి చెప్పినట్టు మౌషుమి గుర్తుచేసుకున్నది. “ఆరోజు శక్తి అంకుల్ నాకు ఫోన్ చేశారు. ‘బచ్చన్‌తో ఏమైనా గొడవ జరిగిందా?’ అని అడిగారు. అలాంటిదేమీ లేదని చెప్పాను. ‘ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కామన్! దానికే శత్రువుగా చూస్తే ఎలా?’ అని కూడా చెప్పాను” అంటూ శక్తితో జరిగిన సంభాషణను వివరించింది.
ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చింది పనిచేయడానికి మాత్రమేననీ, ఎవరినో స్నేహితులుగానో, శత్రువులుగానో మార్చుకోవడానికి కాదనీ చెప్పుకొచ్చింది. ఆ సంఘటన తర్వాత బిగ్ బీతో కలిసి 2015లో వచ్చిన ‘పికు’ సినిమాలో కలిసి నటించింది మౌషుమి. ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. ఇదే ఇంటర్వ్యూలో మరో పాత ముచ్చట.. తనను ఫొటోగ్రాఫర్ ‘జయా బచ్చన్’ అని పిలవడంపై జరిగిన వివాదంపైనా స్పందించింది మౌషుమి. ఒక సందర్భంలో కొందరు ఫొటోగ్రాఫర్లు మౌషుమీని ‘జయా బచ్చన్’ అని సంబోధించారు. దాంతో, వారిపై విరుచుకుపడింది మౌషిమి. ‘నన్ను జయా బచ్చన్ అని పిలవకండి. నేను చాలా మంచి వ్యక్తిని’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మాటలు అప్పట్లో వివాదానికి దారి తీశాయి. తనకు పోలికలు నచ్చవనీ, 70లలో కొందరు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య అంతర్లీనంగా ఉద్రిక్త వాతావరణం ఉండేదని మౌషిమి అంగీకరించింది. ఇక బెంగాల్‌కు చెందిన మౌషుమి ఛటర్జీ.. 1967లో వచ్చిన బెంగాళీ హిట్ చిత్రం ‘బాలికా బధూ’తో తెరంగేట్రం చేసింది. 1972లో ‘అనురాగ్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పటి స్టార్ హీరోల్లో ఒకరైన వినోద్ మెహ్రా నటించిన ఈ సినిమా.. అద్భుత విజయం సాధించింది. దాంతో మౌషుమి ఒక్కసారిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారిపోయింది. రోటీ కపడా ఔర్ మకాన్, బేనామ్, ఉస్-పార్, మాంగ్ భరో సజ్నా, ప్యాసా సావన్, స్వయంవర్, ఆనంద్ ఆశ్రమం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నది. ఆ తర్వాత మౌషుమి రాజకీయాల్లో ప్రవేశించింది.