Minu Munir | మలయాళ చిత్ర పరిశ్రమలో వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ సంచలన నివేదిక బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండస్ట్రీలో పలువురు నటీమణులు తాము లైంగిక వేధింపులకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నటులపై కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా డైరెక్టర్ బాలచంద్ర మీనన్‌పై నటి మిను మునీర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను డైరెక్టర్ అశ్లీల వీడియోలు చూడాలంటూ బలవంతపెట్టారని.. తాను ఆ వీడియోలు చూడనని చెప్పానన్నారు. ఈ విషయాన్ని ఆమె ఫేస్ బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. 2007 సంవత్సరం నాటి వేధింపులను ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో గుర్తు చేశారు.
డైరెక్టర్ ఆయన గదిలోనే ముగ్గురు యువతులతో అశ్లీల వీడియోలు చూస్తున్నారని.. అదే సమయంలో తాను ఆయన గదిలోకి వెళ్లానని చెప్పింది. తనను చూసిన ఆయన వీడియోలను చూసేందుకు రావాలన్నాడని.. తాను అందుకు అంగీకరించలేదని.. వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది. 2013లోనూ మళ్లీ ఇలాంటి వేధింపులో ఎదురయ్యాయన్నారు. ఓ మూవీ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సమయంలో శారీరక, మానసిక వేధింపులు ఎదురయ్యాయని.. ఆ వేధింపులు ఆగకపోవడంతోనే తాను విసిగి ఇండస్ట్రీని వదిలేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను చెన్నైలో స్థిరపడ్డానని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నటుడు జయసూర్యతో సహా ఏడుగురిపై మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలోనే తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.