Manchu Lakshmi | తొలి సినిమా అనగనగా ఓ ధీరుడుతో నంది అవార్డు అందుకుని తండ్రికి తగ్గ తనయికగా ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది మంచు లక్ష్మీ. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మంచు లక్ష్మీ రాణించలేకపోయింది. ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ దిశగా పరుగులు పెట్టినవే. పలు టాక్ షోలు నిర్వహించిన అవి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక ఇప్పుడు మంచి లక్ష్మీ కెరీర్ చాలా స్లో అయింది. పిట్ట కథలు తర్వాత ఇప్పటివరకు ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు.
నిజానికి మంచు లక్ష్మీ మొదట నటించింది హాలీవుడ్‌లోనే. అమెరికాలో నటనపై శిక్షణ తీసుకుంటున్న టైమ్‌లో ఒక సినిమా, సిరీస్‌తో పాటు షార్ట్ ఫిలిం కూడా చేసింది. ఇక ఆ తర్వాతే ఇక్కడ అరంగ్రేటం చేసింది. కాగా మంచు లక్ష్మీ తన హాలీవుడ్ కెరీర్ మధ్యలో ఆగిపోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. నేను హాలీవుడ్ యాక్టర్‌ని. అక్కడ ఒక సినిమా, సిరీస్ చేశాడు. నా దురదృష్టం కొద్ది అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చా.ఈ పదేళ్లు అక్కడ ఉండుంటే నేను ఎక్కడికో వెళ్లిపోయేదాన్ని. పాప కావాలనుకున్నపుడు ఇండియాకు వచ్చేయాలని డిసైడయ్యా. పిల్లల విషయంలో ఇక్కడున్న కంఫర్ట్, కేరింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు పాపకు రెక్కలొచ్చాయి. మాక్కూడా రెక్కలొచ్చాయి. అందుకే వేరే అవకాశాల కోసం చూస్తున్నాం. మళ్లీ విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేస్తా అని చెప్పింది.
అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతారని వాఖ్యాలు చేసింది. ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు. బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని ఎందుకు చేయడం లేదు. వీళ్లు ఎందులో తక్కువ. అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా. వీళ్లను ప్రేక్షకులు ఒక్క శాతం ప్రేమించిన వాళ్లు ఎక్కడో ఉండేవారు. ఇక ఇక్కడి మేకర్స్ కూడా పక్క రాష్ట్రాల హీరోయిన్లనే కావాలని, తెలుగు వారిని మాత్రం అస్సలు వద్దంటారని విమర్శలు చేసింది.